Archive for the ‘ఆధ్యాత్మికం’ Category

దసరా పండుగ ప్రాముఖ్యత తెలుసుకుందాం…

8053324111_2ee0913168_z
నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే ‘శరన్నవరాత్రులు’ లేదా ‘దేవి నవరాత్రులు అంటారు.
నవ రాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహా మాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. -పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. తొమ్మిది రోజులు నవ దుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవ రాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం.
సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది.
పరమ శివునికి జగన్మాత దుర్గాదేవికి, సిద్ది ప్రదాత గణపతికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. ఇవాల్టికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీ రాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు.
శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు, బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి, పూజిస్తారు. అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కోరోజు ఒక్కో అవతారం ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు.

అమిత శక్తివంతుడు పంచముఖ ఆంజనేయుడు…

download (8)
పంచముఖ ఆంజనేయస్వామి రూపం చాలా ప్రసిద్ధమైనది. రామరావణ యుద్ధంలో పంచముఖ అంజనేయుని ప్రసక్తి కన్పిస్తుంది. రామరావణ యుద్ధం నందు రావణుడు మహీరావణుడి సాయం కోరతాడు. మహీరావణుడు పాతాళానికి అధిపతి. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల శయన మందిరం(తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామలక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. ఈ సంగతి తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను అన్వేషిస్తూ పాతాళ లోకానికి వెళ్తాడు.
పాతాళ లోకంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు పోతాయని తెలుసుకున్న ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుని రూపాన్ని దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయునిది కాగా , గరుడ, వరహ, హయగ్రీవ, నరసింహాది రూపాలతో పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి ఆర్పి శ్రీరామ లక్ష్మణులను కాపాడుకుంటాడు. పంచముఖ ఆంజనేయుడు అమిత శక్తివంతుడు. ఈ రూపంలో స్వామిని నిష్ఠతో పూజించిన వారికి సకల కార్యాలు నెరవేరితీరతాయి.

నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

india

మన శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క ఆధిదేవత ఉన్నారు. లలాట ఆదిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుంచి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మస్థానమైన లలాటం స్థానమయ్యిది. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు కాబట్టి ఎరుపు రంగు బొట్టునే ధరించాలి. అంతేకాక, ప్రాణశక్తికి కారణమైన కారణమైన నరాలకు కేంద్రస్థానం…కాబట్టి ఎరుపు రంగు అఙ్ఞాచక్రం. కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల, మానసిక ప్రవృతులను నశింపజేసే అఙ్ఞాచక్రాన్ని పూజించనట్టేనని శాస్రాలు చెబుతున్నాయి.

శ్రావ‌ణ‌ మాసంలో ల‌క్ష్మీదేవికి పూజ ఎందుకు చేయాలి?… ఎలా చేయాలి?

images

అందరికి లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటాము. నిత్యం లక్ష్మి దేవిని పూజిస్తూనే ఉంటాము, కాని ఆషాఢమాసం తరువాత వచ్చే శ్రావణ మాసంలో లక్ష్మి పూజ చేస్తే చాలా మంచిదని మన పూర్వీకులు అంటారు. ఈ మాసంలో శుక్ర, మంగళ వారాలు ముఖ్యమైనవి. ఈ నెలలో వచ్చే నాలుగు శుక్రవారాలు కూడా లక్ష్మీ పూజ చేస్తారు.

ఈ పూజని ఎలా చేస్తారంటే శుక్రవారం నాడు పొద్దుటే లేచి, స్నానం చేసి, ఇల్లంతా శుభ్ర‌పరచుకుని, వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. తరవాత లక్ష్మిదేవికి ఇష్టమైన శెనగలు నాన బెట్టి వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. శెనగలు అంటే లక్ష్మీ దేవికి చాలా ఇష్టం. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పాలతో చేసిన ఏ వంటకమైన లక్ష్మీ దేవికి ఇష్టమే. అందుకే పాలతో పాయసం, పరవాన్నం ఏదైనా పెట్టచ్చు. పూజ గదిలో లక్ష్మీ దేవిని పూలతో చక్కగా అలంకరించి, నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి. ఎవరినైనా ముత్తైదువును పిలిచి మన శక్తి కొద్ది తాంబూలం ఇవ్వాలి. అయితే నాలుగు వారాలు ఇలా చేసినా, రెండవ వారం వరలక్ష్మి వ్రతం చేస్తారు.

వరలక్ష్మి వ్రతం రోజు అంతా అలానే చేసి, అమ్మవారికి మూడు లేక ఐదు లేక తొమ్మిది రకాల మన శక్తిని బట్టి పిండివంటలు వండి నైవేద్యం పెట్టాలి. ఇక అమ్మవారికి చీర, లక్ష్మీ రూపు, అలంకరణ అన్నీ మన శక్తి మరియు భక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ రోజు వరలక్ష్మి వ్రత కథను చదువుకుని, తోరణం చేతికి కట్టుకోవాలి. ఇలా పూజ చేసుకుని, ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వాలి. ఇది పెళ్లి కానివారికి, పెళ్లి అయిన ముత్తైదువులకు కూడా చాలా మంచిది.

1. శ్రావణ మాసంలో లక్ష్మీ దేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది.

2. పెళ్లి అయిన వారు ఈ పూజ చేసుకోవడం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు.

3. లక్ష్మీ అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటారు. ధనము, ధైర్యము, విద్య, ధాన్యము, విజయము, పరపతి, సంతానము, గుణము ఇవన్నీ కూడా మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తాము.

4. శ్రావ‌ణ‌మాసంలో పెళ్ళిళ్ళు కూడా ఎక్కువగా అవుతాయి. కొత్త పెళ్ళికూతురితో అత్తగారు ఈ వ్రతం చేయిస్తుంది. అంటే ఆమెకు పూజలు, వాటి విధానం మరియు వాటి ప్రాముఖ్యత తెలుస్తుంది.

5. ఈ మాసంలో ఈ పూజ చేయడం వలన సకల సంపదలు, సుఖసంతోషాలు కలుగుతాయని ప్రతీతి.

6. ఏ ఇంట్లో ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటూ, ఇంటిని, ఇంటిల్లపాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అన్ని మరియు అందరి పనులు విజయవంతం అవుతాయి.

7. అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని, ఏ ఇంట్లో కంటతడి పెట్టనీయక చక్కగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు.
మన పూర్వీకులు మనకి ఇచ్చిన ప్రతీ పూజలో, సాంప్రదాయాలలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు మరియు మనుషుల జీవన శైలికి కావాల్సిన మంచి సూత్రాలు ఉంటాయి.

శుభకార్యాల్లో మామిడి ఆకులు తోరణాలు ఎందుకు కడతారు…?

00142a67b0d445ad5461a35e530f56c5
మామిడి చెట్టు కోరికలను తీరుస్తుందనీ, భక్తి ప్రేమకు సంకేతమని భారతీయ పురాణాలలో చెప్పబడింది. ఇది సృష్టికర్త బ్రహ్మకు అర్పించిన వృక్షం. దీని పువ్వులు చంద్రునికి అర్పించబడ్డాయి. కాళిదాసు ఈ చెట్టును మన్మథుడి పంచబాణాలలో ఒకటిగా వర్ణించాడు.
ఈ చెట్లు ఆంజనేయుడి ద్వారా భారతదేశంలోనికి వచ్చిందని పురాణగాథ. సీతాన్వేషణ సమయంలో మామిడి పండు వాసనకు ఆకర్షితుడై, ఆ పండుని తిని టెంకను నీళ్లలో విసిరేశాడట హనుమంతుడు. ఆ టెంక నీళ్లలో తేలుతూ భారత భూమిని చేరి చెట్టుగా మారిందని చెపుతారు.
శివపార్వతుల కళ్యాణం మామిడి చెట్టు కిందనే జరిగిందనీ, అందుకే శుభకార్యాలలో మామిడి ఆకులను ఉపయోగిస్తారని, చివరికి అంత్యక్రియలో మామిడికట్టెను ఉపయోగిస్తారని చెపుతారు. ప్రాచీన కాలంలో వివాహానికి ముందు వరుడు మామిడి చెట్టుకు పసుపు, కుంకుమ రాసి ప్రదక్షిణం చేసి ఆ చెట్టును ఆలింగనం చేసుకునేవాడట.

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్…

shridi-sai-baba2
సదానింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యం ప్రియంతం,
తరుం కల్పవృక్షాధికం సాధయంతం,
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.
సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే
భవద్భవ బుద్ధ్య సపర్యాది సేవాం,
నృణాం కుర్వతాం భుక్తి ముక్తి ప్రదంతం,
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి… తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆయుష్షు ప్రాప్తి…

tulsi-plant-in-pot

కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని, చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు. ఈ రోజుని ‘తులసి ద్వాదశి’ అని కూడా అంటూ వుంటారు. ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్శనం ఇచ్చే శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశి రోజు శ్రీమహాలక్ష్మితో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట. అందువల్ల ఈ ద్వాదశిని బృందావన ద్వాదశి అని కూడా అంటారు. బృందావనం అంటే మన ఇంట్లో వుండే తులసి దగ్గరకు వస్తారు. ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా వెలిగించక పోయినా ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది అని అంటారు.

దూర్వాస మహర్షి వారి చేత శపించబడి వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు ఆలోచనతో రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మథనం  ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని మధించినరోజు కాబట్టి ఇది ‘క్షీరాబ్ది ద్వాదశి’ అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక  పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు చుక్కలు మునుల మీద, దేవతలమీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చినుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.
క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనే ఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీ రూపంతో అలంకరిస్తారు. సుగంధ ద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.
‘క్షీరాబ్ది ద్వాదశి’ రోజున తులసి తప్పనిసరిగా పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ శుభ దినాన శ్రీమహాలక్ష్మితో కలిసి శ్రీమహావిష్ణువు తులసి కోటలోకి ప్రవేశిస్తాడని అంటారు. తులసికోటలో లక్ష్మీనారాయణులు కొలువై వుంటారు గనుక, ఈ రోజున చేసే తులసి పూజ మరింత విశేషమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది. భక్తి శ్రద్ధలతో తులసిని పూజించి, దీపదానాలు చేయడం వలన సమస్త దోషాలు నశిస్తాయనీ, అపమృత్యు భయాలు తొలగిపోతాయని  ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజు తెల్లవారు జామునే పుణ్యస్త్రీలు తలంటు స్నానం చేయాలి.
తులసి కోటను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించాలి. తులసికోట దగ్గర దీపం పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత పూజా మందిరం చెంత యధావిధిగా నిత్య పూజను జరపాలి. మరలా సాయంత్రం తులసి పూజ అయ్యేంత వరకూ ఉపవాసం వుండాలి. సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించిన దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

ఇంటి ముందు ముగ్గు వేస్తే, ల‌క్ష్మీదేవి గ‌డ‌ప దాట‌దు… ఇవన్నీ తెలుసుకోండి…

rangoli-desing-with-dots-peacock-3

హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి అనేది కూడా ఉంది. ఇంటి ముందు, లేక గడప పైన‌, గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డ గీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి. ముగ్గువేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే, అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి.

ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి.
యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.
దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. అంతేకాదండోయ్! మనం రోజూ ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి.
– ముగ్గు అంటే అదో పాజిటివ్ సైన్… దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది… 
ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు భిక్షగాళ్లు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి భిక్షం అడిగేవారుకాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి. అందుకే ఏ ఇంటి ముందు ముగ్గు లేదో ఆ ఇంట్లో ఇల్లాలికి ఏమీ తెలియ‌ద‌ని అర్ధం.

కార్తీక మాస విశేష దినం కార్తీక పౌర్ణమి… సోమవారం నాడు ఇలా చేయండి…

images-2
కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటారు. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసు కూడా జ్ఞాన పూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యం. హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజన దీప దానం చేస్తే సకల పాపలు తొలగి, మోక్షం కలుగుతుందని చెబుతారు. దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని, సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి. కార్తీక మాసంలో చేసే దీప దానం వలన స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.

కార్తీక పౌర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి. ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. గంగా, గోదావరి మొదలైన పుణ్య నదుల్లో కార్తీక దీపాలను వదలడం కన్నుల పండుగగా జరుపుతారు. కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురున్ని సంహరించినట్లుగా పురాణాల ఆధారంగా తెలుస్తుంది.
కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.
కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభ దీపం పెట్టినవారు శ్రీమహా విష్ణువుకి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసినవారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు. స్తంభ దీపం పెట్టని పిత్రు దేవతలకు నరక విముక్తి కలగదంటారు. ఈ రోజున ధ్వజ స్తంభం పైన నందా దీపం వెలిగిస్తారు.
జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు. శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసం లోని కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూతప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి. కార్తీక జ్వాలాదర్శనం వలన మానవులకు, పశుపక్ష్యాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి.
అట్లే మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే… కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.
కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన ఎంతో ప్రాముఖ్యమైనది. ఏకతస్సర్వదానాని దీపదానం తథైకత అని శాస్త్రవచనం. అంటే అన్ని దానాలు ఒక ఎత్తు దీపదానం ఒక ఎత్తు అని అర్ధం. దీపదానం చేసేవారు పైడి పత్తిని తీసి వారే స్వయంగా ఒత్తులను తయారుచేయాలి. వరిపిండి, గోధుమ పిండితో ప్రమిదను తయారుచేసి అందులో ఒత్తిడిని ఉంచి ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించి పూజింజి దానికి నమస్కరించి కార్తీక సోమవారం లేదా పౌర్ణమి రోజున కార్తీక మాసంలో ఏ రోజునైనా, శైవ వైష్ణవాలయాల్లో ఉత్తముడైన బ్రాహ్మణుడికి దానం చేయాలి. కార్తీక మాసమంతా ప్రతీ ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా తులసీ బృందావనం దగ్గర దీపాలను వెలిగించడం మన సంప్రదాయం. దీపం వెలిగించిన తర్వాత “దీపంజ్యోతి పరబ్రహ్మః దీపం సర్వతమో పహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యాదీప నమోస్తుతే” శ్లోకం ద్వారా స్తుతించడం మన ఆచారం.
కార్తీక పౌర్ణమి రోజున సాయం సమయంలో ప్రమిదల్లో నూనె పోసి దీపాలను వెలిగించాలి. వాకిలి ముందు ప్రమిదలను వెలిగించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. దీపాన్ని ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ దీపదర్శనం చేస్తారో ఆ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారు పాప విముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందుతారని నమ్మకం. ఇతరుల వెలిగించిన దీపాన్ని ఎవరైతే ఆరిపోకుండా చూస్తారో వారు ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. కార్తీకమాసంలో సువాసినులు ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఆ సమయంలో లక్ష్మీదేవిని “ఓం లక్ష్మైనమః..” ధ్యానించి పూజించాలి.

శివునికి పరమ ప్రీతికరమైన ‘కార్తీక సోమవారం’…

images-1
కార్తీకమాసం ఆధ్యాత్మికపరమైన అనేక విశేషాల సమాహారం. ఈ మాసంలో ప్రతి రోజు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. సాధారణంగా పరమశివుడికి సోమవారం ప్రీతికరమైన వారం. సోమ .. అంటే, స – ఉమ అనే అర్థం ఆవిష్కరించబడుతోంది. స- ఉమ అంటే ఉమతో కూడినవాడుగా శివుడు చెప్పబడుతున్నాడు. ఈ కారణంగానే సోమవారం రోజున చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయని అంటారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలోని సోమవారాలు మరింత విశేషాన్ని కలిగినవిగా కనిపిస్తుంటాయి.
ఈ కార్తీక మాసంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగల్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. కార్తీక సోమవారాల్లో సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి, పూజా మందిరాన్ని అలంకరించాలి. భక్తిశ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి, బిల్వ దళాలతో అర్చించాలి.
శివుడిని బిల్వ దళాలతో పూజించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పరమశివుడికి ఇష్టమైన పాయసాన్ని ఈ రోజున నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం వలన కష్టాలు తొలగిపోతాయని స్పష్టంచేయబడుతోంది. ఈ రోజున శివాలయానికి వెళ్లి స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాన్ని వెలిగించాలి.
ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించడం వలన సమస్త దోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వరుడిని ఆరాధించడం వలన మోక్షానికి అవసరమైన అర్హతను పొందడం జరుగుతుంది. ఆదిదేవుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లు, కార్తీకమాసంలో చివరిసోమవారాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. ఆ రోజంతా సదాశివుడి సేవలో తరించాలి.